అమావాస్య సోమవతీ వ్రతము
అమావాస్య సోమవతీ వ్రతము – 2(వ్రత కథ)
వ్రత కథా ప్రారంభము
ధర్మ స్వభావుడైన “ధర్మరాజు ” అంపశయ్య పై పడుకొని యున్న భీష్మ పితామహుని చూచి సాష్టాంగ నమస్కారము (అనగా వ్యక్తి తన మోకాళ్ళపై వంగి ఎదమకాలిపై కుడికాలు పెట్టి రెండు చేతులతో నమస్కారము చేయవలెను ) చేసి ఇలా అడిగెను. దుర్యోధనుని యొక్క దురాశ చేత మన కులమంతయూ నశించెను ,భూమిని పాలించు రాజులందరూ మరణించిరి భూమియందు చిన్నవారు, ముసలివారు ,వ్యాధి (రోగము)తో బాధ పడువారు తప్ప ఇంకెవరూ లేరు. ఈ భారత వంశమున మేము( అనగా పాండవులు ) ఐదుగురము మిగిలితిమి .అటువంటి రాజ్యాధికారము కూడా ప్రకాశించదు .సంతానము (బిడ్డలు ) యుద్దములో మరణించుట వలన కొంచెము కూడా సంతోషము కలుగుట లేదు . అశ్వద్దామ యొక్క ‘అస్త్రము ‘ (ఆయుధము ) చేత ఉత్తర గర్భము దగ్ధ మైనందున (పోయినందున )బాధ కలిగెను. కావున ఏమి చేయవలెను ? ఇందువలన సంతానము (బిడ్డలు ) ఎక్కువకాలము జీవించుటకు (బ్రతికి యుండుటకు) ఏ ఉపాయము ఉన్నదో దానిని తెలుపుము., అనగా కౌరవ ,పాండవులకు తాత ఐన భీష్ముడు ఇలా చెప్పు చున్నాడు. ధర్మ పుత్రుడా సంతానము చిరకాలము (ఎక్కువకాలము ) బ్రతుక గల వ్రతమును ఒక దానిని నీకు చెప్పెదను వినుము. అది అటువంటి వ్రతములలో ఉత్తమమైన వ్రతమును గూర్చి చెప్పెదను వినుము అని ఇలా చెప్పెను.
అమావాస్యా సోమవారముతో కూడిన రోజున అశ్వత్ధ వృక్షమును (రావి చెట్టు ) దాని మూలమున ఉన్న విష్ణువును పూజించి ,నూటెనిమిది (108 ) లెక్క గల రత్నములు గాని ,బంగారము గాని ,పండు మొదలైనవి గాని చేతిలో పట్టుకుని ,వృక్షమునకు నూట ఎనిమిది ప్రదక్షణలు చేయవలెను . ఓ ధర్మజా ! ఈ వ్రతము శ్రీ మహా విష్ణువునకు చాలా ఇష్టమైనది మరియు శ్రేష్టమైనది .అభిమన్యుని బార్య ‘ఉత్తర ‘ ఈ వ్రతము చేతనే తన పుత్రుని (కొడుకుని ) బ్రతికించు కున్నది. గుణ వంతుడైన ,ముల్లోకములలో (ఖ్యాతి ) పేరు పొందగల కుమారుని కన్నది . అని చెప్పిన భీష్ముని మాట విని ధర్మరాజు ఇలా చెప్పుచున్నాడు.
ఓ పితామహా వ్రతములలో గొప్పదైన ఆ వ్రతమున గూర్చి నాకు వివరముగా తెలియ చెప్పుము .ఆ వ్రతమును ఈ భూలోకములో ఎవరు చేసిరి ఇలా అడిగిన ధర్మరాజుతో భీష్ముడు ఈ విధముగా చెప్పు చున్నాడు .
అంతటనూ పేరు పొందిన కాంచి అను పట్టణము ఒకటి ఉండెను. ఆ పురములోని బ్రాహ్మణ , క్షత్రియ ,వైశ్య, శూద్ర ఈ నాలుగు జాతులవారు తమ తమ ధర్మములను చక్కగా ఆచరించు చుండిరి .ఆ నగరం ఇంద్రుని ఇంద్రుని అమరావతి నగరం వలె ప్రకాశించు చుండెను . ఆ పట్టణ మందు రత్న సేనుడు అను రాజు కలడు అతను రాజ్య పాలనము చేయు చుండగా దేవతలు ,ప్రజలు సంతోషించిరి . ఈతి బాధలు లేకుండెను . ఇలా ఉండగా ఆ నగరంలో దేవ స్వామి అని పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు ఉండెను. ఆయన భార్య ‘రూపవతి ‘ ధనవతి అని పేరు కలిగినది .ఆమె లక్ష్మీ వలె ప్రకాశించు చుండెను . ఆమెకు ఏడుగురు కొడుకులు , అందమైన కుమార్తెను కనెను . ఇలా తన కొడుకులు , కోడళ్ళు ,మనుమలు ,మనుమరాండ్రతో సంతోషించు చుండెను. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ‘బిక్ష ‘ (అనగా తినుటకు కావలసిన ఆహారమును ప్రతి ఇంటి ముందు నిలుచుని అడుగుట ) కొరకు వచ్చెను .అతనిని చూచి ,దేవస్వామి యొక్క కోడళ్ళు ఏడుగురును, ప్రేమతో అతనికి వారు ప్రత్యేకించి బిక్షను తెచ్చి వేసిరి. ఆ బ్రాహ్మణుడు సంతోషించి ,మీకు సుమంగళీ త్వము (అనగా భర్త చనిపోకుండా కాపాడ బడునది ) మంచి సంతానము (అనగా మంచి బిడ్డలు ) కలుగును. అని దీవించెను. ఆ తరువాత ‘ధనవతి ‘తన కూతురైన ‘గుణవతి ‘ ని పిలిచి ఓ అమ్మాయీ నీవు ఈ విప్రునికి (అనగా బ్రాహ్మణునికి ) బిక్షను పెట్టుము అనగా ఆమె అట్లు చేసెను .అప్పుడు ఆ విప్రుడు ఓ శుచి కలదానా (అనగా శుబ్రమైన దానా ) నీవు ధర్మవతివి కమ్ము అనెను. అది విని ఆ ‘గుణవతి ‘ తల్లి దగ్గరకు పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వ దించిన విధము తెలిపెను అది విని ఆ ‘ధనవతి ‘ కూతురును తీసుకుని మరల ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి తన కూతురు చేత నమస్కారము చేయింపగా ఆ బ్రాహ్మణుడు ఇంతకు ముందు ఆశీర్వదించినట్లు ఆశీర్వదించెను. అది విని ధనవతి బాధ చెంది విప్రునితో (అనగా బ్రాహ్మణునితో ) ఇట్లన్నది .ఓ బ్రాహ్మణ శ్రేష్టా నియమ యుక్తులైన (నియమములు ఆచరించిన ) నా కోడళ్ళకు మాత్రము’ సౌమంగల్య కరము ‘ కలుగును గాక అని ఆశీర్వ దించి ,నా కూతురు నమస్కరించి నపుడు ధర్మవతి ,దీర్ఘాయువు అనగా నూరు సంవత్సరములు జీవించు దానవు కమ్ము అని భౌధముగా ఆశీర్వదించితివి ఎందుకు ? అని అడుగగా ఆ బ్రాహ్మణుడు ! ఓ ధనవతీ నీవు పున్యవతివి ,కీర్తి కలదానవు కావున నీ కుమార్తె గూర్చి చెప్పెదను వినుము. ఈమె సప్తపదీ మధ్య మందు వైధవ్యము చెందగలదు .కావున ఉత్తమమును , నాశనము కానిది ఐన ధర్మమును ఎక్కువగా చేయవలయును .కావున ఇలా ఆశీర్వదించితిని అని బ్రాహ్మణుడు పలుకగా ఆ ధనవతి బాధ చెందిన హృదయముతో అతనికి నమస్కరించి ,దీనిని పోగొట్టుకొనుటకు ఏదైనా ఉపాయము ఉన్నచో చెప్పుమనగా ఆ బ్రాహ్మణుడు ఓ ‘ధనవతీ ‘ఈమె వివాహ సమయమున సోమ అనునది వచ్చి ,ఈమె వైధవ్యమును పోగొట్టును గాక అనిన విని ,ధనవతి ఇలా అడుగుచున్నది . ఓ బ్రాహ్మణ శ్రేష్టా ఈ సోమ అను ఆమె ఎవరు ? ఆమె జాతి ఏమి ? ఎక్కడ నుండి వచ్చినది .దానినంత వివరించ మనగా ఆ బ్రాహ్మణుడు చెప్పు చున్నాడు.
ఓ ‘ధనవతి ‘ దేశమందు సోమ అను పేరుగల చాకలి ఆమె ఒకతి ఉన్నది . ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురు వైధవ్యము పోవును .అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్లి పోయెను. ఆ తరువాత ధనవతి తన కొడుకులను పిలిచి, ఈ కధ చెప్పును. ఓ పుత్రులారా ,మీ చెల్లెలుకు ఒక బ్రాహ్మణుడు సప్తపదీ మధ్యమున వైధవ్యము ప్రాప్తించును. అనగా కలుగును అని చెప్పినాడు సింహళ దేశమున ఉన్న ఒక చాకలి ఆమెను తెచ్చినచో వైధవ్యము తొలగిపోవును . అని చెప్పినాడు .కావున మీరు సింహళ దేశమునకు పోవలయును అనగా కొడుకులు ఇలా పలికిరి .ఓ తల్లి తండ్రులారా కుమార్తె యందు ఉన్న ప్రేమతో ఏడు ఆమడల దూరమున ఉన్న సింహళ దేశమునకు మమ్ము పొమ్మను చున్నారు.దేశము విడిచి మేము వెళ్ళము అని పలికిరి.సోమా సముద్రము యొక్క మధ్యన ఉన్నది .అది దాటుట కష్టము కనుక మేము పోలేము అని పలుకగా వారి తండ్రి ఐన ‘దేవస్వామి ‘ తన ఏడుగురు కొడుకులతో తాను కూడా సింహళ దేశమునకు వెళ్లి పుత్రిక యొక్క వైధవ్యము పోవుటకు సోమయను ఆమెను తెచ్చెదను అని కొడుకులతో పలుకగా అది విని శివ స్వామి అను చిన్న కొడుకు తండ్రితో ఓ తండ్రీ మీరు అలా చెప్పుట వలన మాకు మంచి కలుగదు .సింహళ దేశమునకు నేను పోయెదను.
అని వెంటనే లేచి తన’ సోదరి ‘ (అక్క లేక చెల్లెలు ) ను తీసుకుని ప్రయాణ మయ్యెను. కొన్ని రోజులకు సముద్ర తీరము చేరి అక్కడ విశాలమైన ఒక మఱ్ఱి చెట్టు (వట వృక్షము ) నీడన కూర్చుని ఉండగా ఆ చెట్టు యందు ఉన్న ఒక( గృద్ర రాజము ) గ్రద్ద పక్షి వేరు చోట నుండి తెచ్చిన మెత్తని మాంసము చేత తన పిల్లలను కాపాడు చుండెను. ఇది చూచి ఆ బ్రాహ్మణ కుమారుడైన శివ స్వామి వేరే కొంత మాంసము తెచ్చి ఆ గ్రద్ద పిల్లలకు వేయగా అవి దానిని ముట్టుకోనలేదు .వెంటనే ఆ గ్రద్ద చూచి, దాని పిల్లలతో ఎందుకు తినలేదని అవి ఇట్లు పలికెను. ఓ తండ్రీ ఈ చెట్టు క్రింద ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై (భోజనము చేయని వాడై )ఉండగా మేము ఎట్లు చేయుదము అనగా ఆ పక్షి రాజు దయ కల్గిన వాడై వారి దగ్గరకు వచ్చి మీ కోరికను తెలుసుకుంటిని ,మిమ్ములను రేపటి ఉదయమున “సింహళ ద్వీపము “చేరునట్లు సముద్రము దాటించెదను. అని చెప్పి ,మరల తన బిడ్డలకు భోజనము పెట్టి మరునాడు తెల్లవారు ఝామున ఆ పక్షిరాజు వారిని సముద్రము దాటించి ,ఆ సముద్ర మధ్యమున ఉండు సింహళ ద్వీపము నందు సోమా ఇంటి తలుపులు చూపగా వారు ఆ రోజు నుండి ఆ ఇంటిని ఊడ్చి ,అలికి (అనగా ఆవుపేడ ,బర్రె పేడ ఈ రెండిటిలో ఏదో దాని చేత నైననూ పూర్వము ఇల్లు శుభ్రము చేసేవారు ) ఇలా చేసి, ఒక సంవత్సరము వారు అక్కడ అలా గడిపారు. ఇలా ఉండగా (రజకి) చాకలి ఐన సోమ అనునది ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులచే అలంకరింపబడిన దానిని చూచి ఆశ్చర్యము చెంది ఇలా ముగ్గులు అందముగా వేసిన వారు ఎవ్వరో అని ఆలోచించు చుండగా ఆ విపర కన్య (అనగా బ్రాహ్మణ కన్య ) కనిపించెను. తన అన్న తో కూడా వెలగు చున్న ఈ కన్యను చూసి ,దేవతా మూర్తులవలె వెలుగుచున్న మీరెవరు ? ఈ దేశమునకు ఏల వచ్చితిరి ? తుచ్చమైన జాతిగల (అంటే నీచ జాతి గల ) నాకు మంచి చరిత్ర కల మంచి జాతి యందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణ మేమి ? అని అడిగిన ఆ శివ స్వామి ఇట్లు చెప్పెను
‘గుణవతి ‘ అని పిలువబడే ఈ కన్యకు సప్తపదీ మధ్యమున ‘ వైధవ్యము కలుగునని ఒక బ్రాహ్మణుడు పలుకగా అది విని ,ఆ బ్రాహ్మణుని అది తొలగుట ఎట్లు అని అడుగగా అతడు సింహళ ద్వీపమున కల ‘సోమ ‘ అని చాకలి దగ్గర ఉండుట చేత ఈ ‘దుష్ట దశ ‘ తొలగును అని చెప్పగా ,విని ఈమెను తీసుకుని నీ దగ్గరకు వచ్చితిని అని చెప్పెను . అది విని సోమ ఇక మీరు దాస్యము (సేవ ) చేయుట మానుము అనెను .మీ ఆజ్ఞ చే ‘వైధవ్య ‘ నివృత్తికై వచ్చెదనని తన కోడళ్ళను పిలిచి నేను పొరుగు దేశము వెళ్ళు చుంటిని మీరు నేను వచ్చు వరకు ఈ ప్రదేశము నందు ఎవ్వరైనా చనిపోయినచో వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడుము.అనగా విని అట్లే చేసెదము అనిరి .ఆ తరువాత ఆ’ సోమ ‘ బ్రాహ్మణుని ,అతని చెల్లెలిని ఆకాశ మార్గమున సముద్రము దాటించి ,అనేక దారులు దాటి నిముషములోనే ఆమె మహిమచే కాంచి పురమున ఉండగా ఆ దేవస్వామి ఇంటిలో ధనవతి తన కూతురు వైధవ్యము మాన్పుటకై వచ్చిన సోమను చూచి ,అతి ప్రేమతో ఉపచారములు చేసెను.
అది ఇలా ఉండగా ,శివస్వామి తన చెల్లెలికి తగిన వరుని తెచ్చుటకై వేరే దేశము పోయి ఉజ్జయని నగరములో చేరి ,అక్కడ ఉన్న దేవ శర్మ కొడుకైన రుద్ర శర్మ అను పేరు గల ఒక వరుని తీసుకుని వచ్చి అతనికి పదివేల వరహాలు ధనమును ఇచ్చెను. తరువాత దేవస్వామి మంచి నక్షత్రము కల మంచి ముహూర్తమును సోమా సహాయముచే కన్యాదానము చేయగా హోమాదులు చేయు చుండ (యజ్ఞము చేయుచుండ) సప్త పది మధ్యమున దేవశర్మ ఉన్నవాడు ఉన్నట్లే మరణించెను. ఆ సమయమున చుట్టములు అక్కడ చూచి గట్టిగా ఏడ్చు చుండగా ,అందరూ చూచు చుండగా ఆ సోమ వ్రత ప్రభావముచే మరణం నశింప చేయునట్టి ఈ వ్రత పుణ్యము సంకల్పముతో సహా గుణవతికి ఇవ్వగా దేవశర్మ దాని మహిమచే నిద్ర నుండి లేచుచున్న వానివలె లేచుట చూచెను . సోమ వివాహము జరిపించి ,తన దేశమునకు వెళ్ళుటకు సిద్దమయి ఆ వ్రతమును ఆమెకు ఉపదేశించెను.వారి చేత ఆజ్ఞను పొంది తిరిగి తన దేశమునకు వెడలెను .
అశేషం హరయే శోకం వృక్ష రాజ నమోస్తుతే ||
ఆశ్వత్దే వో నిషధనం వర్నే వోవ సతః కృతా |
గోభాజ ఇభి జలా సదయత్సన వధు పూరుషం |
మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే |
అగ్రత శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమః ||
యాని కానిచ పాపాని బ్రహ్మ హత్యా సమానిచ |
తాని సర్వాణి నశ్యంతు ప్రదక్షిణ పదే పదే ||
అను ఈ మంత్రములను చదువుచూ ముత్యములు, బంగారము ,వెండి, వజ్రము మొ|| తొమ్మిది రకముల మణుల చేతను ,భక్ష్య పూర్ణములైన (అనగా భోజనము చేయు పాత్రలు అంటే పళ్ళెములు ) పాత్రలు చేతి యందు ఉంచుకొని నూట ఎనిమిది ప్రదక్షిణములు అశ్వత్ధ వృక్షము దగ్గర ఉంచిన ఈ వస్తువులు గురువుకు ఇచ్చి సోమ ప్రీతీ కొరకు ముత్తైదువులను పూజించి బ్రాహ్మణులను పాయసము మొదలగు పిండి వంట పదార్ధములచే బ్రాహ్మణులను తృప్తి పరచి ఆ తరువాత మౌనముగా (అనగా ఏమి మాట్లాడక ) తాను తినవలెను . ఓ ధర్మరాజా ! ఈ ఉత్తమమైన వ్రతమును నీవు కూడా నీ భార్య యైన ద్రౌపది చేత చేయించినచో ,వారి బిడ్డలు దీర్ఘాయులై ఉందురు అన్న భీష్మునితో ధర్మరాజు ఇలా పలుకు తున్నాడు. ఓ పితామహా ! బంగారు ఆభరణములు మొ || వి లేని స్త్రీలకు ఈ వ్రత ఫలమును సంపూర్ణముగా ఎలా లభించును అనిన విని భీష్ముడు ఇలా అంటున్నాడు .ఓ పాండు నందనా ! పూవులు ,పండ్లు,పాయసాన్నముల ద్వారా ప్రదక్షిణము చేసినచో వారికి దరిద్రము అంతా నశించి పూర్ణ (మొత్తము ) ఫలమును పొందుదురు. ఇలా వ్రతమును స్త్రీ లందరూ ఆచరింప వచ్చును . దేవదేవుడైన శ్రీ మహా విష్ణువుకు ఇష్టమైన ఈ వ్రతమును ఏ ‘స్త్రీ ‘ తన భర్త ,బిడ్డల కొరకు ఈ వ్రతమును ఆచరించునో (చేయునో ) ఆమె కోరికలు అన్నియు నెరవేరును. దీనికి ఉద్యాపన విధము కూడా ఉన్నది.
ఇది చేయని వారికి వ్రతము సంపూర్ణము కాదు .అష్ట దళ పద్మము ఏర్పరిచి దాని యందు పన్నెండు కలశములను ఉంచి, శక్తికి మించకుండా బంగారముచేత అశ్వత్ధ (రావి చెట్టు ) వృక్షమును దాని అడుగున నాలుగు చేతులతో కూడిన లక్ష్మీ నారాయణుల బొమ్మను ,బ్రహ్మ శివుడు మొ || దేవతా మూర్తులను ,ప్రత్యేకముగా చేయించి అందు శ్రీ మహావిష్ణువు మొదలైన దేవతలను ఆవాహనము ,మొ ||న షోడశోపచార పూజించి వారి వైభవము కొలది ధూప దీప నైవేద్యములు ఇచ్చి ,రాత్రి పురాణము చదువుచూ జాగరణము చేసి ,మరునాడు ఉదయమున (ప్రొద్దున్న ) అశ్వత్ధ (రావిచెట్టు ) ఆకుల చేతను ,పాయసము చేతనైననూ ,ప్రణవ మంత్రము అనగా ఓంకార చేత నైననూ ,హోమ కుండము (అనగా యజ్ఞము చేయుటకు వీలైన మండపము ) ఏర్పరిచి (దీనిని ఇటుకలతో నాలుగు వైపులా కట్టి అమర్చుతారు ) త్రిమూర్తి స్వరూపుడైన ఆశ్వత్ధుని కడకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూర్తి స్వరూపమైన అశ్వత్ధ వృక్షము కొరకు పూర్ణాహుతి గావించి (అనగా యజ్ఞ కుండములో వేయు పదార్దములు వేసి ) తరువాత గోవులు గురువుకు ఇచ్చి, బ్రహ్మ పూజ చేసి ,బ్రహ్మ విష్ణువుల (ద్వాదశ ) పన్నెండు కలశములను బ్రాహ్మణులకు ఇయ్యవలెను . ఇలా కలశ దానములు చేసి ,పాయసము, పిండి వంటలచే బ్రాహ్మణులను తృప్తి పరచి వస్త్రములు , దక్షిణ( అనగా తమ శక్తి కొలది పైసలు ) ఇచ్చి సాష్టాంగ నమస్కారము అనగా (వ్యక్తి తాను ఎడమకాలిపై కుడి కాలు పెట్టి వంగి రెండు చేతులతో నమస్కారము చేయుట ) ఇలా చేసి ,వారి ఆశీర్వాదం పొంది తరువాత తాను ‘భోజనం ‘ చేయవలయును.
ఇలా పన్నెండు సంవత్సరములలో ఎప్పుడైనా ఉద్యాపనము చేసినచో ఈ వ్రతము యొక్క ఫలము సంపూర్ణముగా లభించును. అని ‘భీష్ముడు’ చెప్పగా విని ‘ధర్మరాజు ‘ ఉత్తర మొ || వారిచే చేయించి నందు వలన ఉత్తర కొడుకైన అభిమన్యుడు మొ || వారు అభివృద్ధి చెంది విలసిల్లెను . ఇది భవిష్యత్తు పురాణములోని సోమవార వ్రతము.
Comments
Post a Comment
thanking you comment visit our website
https://kbsastrology.com/