అట్లమీద ఆవపూల నోము.
అట్లమీద ఆవపూల నోము.
ప్రాచీన కాలంనాటి మాట. ఆ కాలాన ఒక ధనికరాలుండేది. ఆమె గొప్ప శ్రీమంతురాలు. ఆమె అనేక నోములు నోచినది. అందులో అట్లమీద ఆవపూవుల నోము ఒకటి. ఆ నోము పట్టినది కానీ మధ్యలో మానేసింది. ఏ కారణంగానో విడిచిపెట్టింది. దాంతో ఆ శ్రీమంతురాలి భర్త, కుమారులు మరణించారు. సంపద పోయినది. దరిద్రురాలైనది. ఎవరూ ఆదుకోలేదు. గొప్పగా జీవించిన ఆ ఇల్లాలు ఉన్న ఊరిలో ఉండలేక విచారిస్తూ , భాదపడుతూ, దుఃఖిస్తూ అడవులవెంటపడింది.దరి తెన్నూ కానక తిరుగుతోంది.
అలా తిరిగే ఆమెకు ఆ అడవిలో పార్వతీపరమేశ్వరులు కనిపించారు. ఎవరివమ్మా నీవు? అని అడిగారు. ఏ ఊరని ప్రశ్నించాడు. విచారిస్తూ ఇలా అడవిలో సంచరించడానికి కారణం ఏమిటని వివరంగా చెప్పమని అడిగారు. ఆమె బదులు చెప్పలేదు సరికదా విసుక్కుంది. నా విషయం మీకెందుకంది., చీదరించుకుంది. అవునులెండి తప్పు ఆమెది కాదు కష్టాలవల్ల ఆలా అంది. అడిగినవారు గౌరీ - శంకరులని ఆమెకేం తెలుసు? వారు ఆమె కష్టాలు తీర్చేవారని మాత్రం ఆమె గుర్తించగలడా? దుఃఖించి ముందుకు పోసాగింది.
అంత పార్వతీపరమేశ్వరులు - పిచ్చిదానా! నీ కథ అంటా మాకు తెలు. మేము ఆదిదంపతులం, ఉమామహేశ్వరులము.నీబాధ తీర్చాలని నీ కష్టాలు గట్టెక్కించాలని ఇక్కడ ఉన్నాము. నీవు అట్లమీద ఆవపూల నోము విడచిపెట్టావు. అందుకే అష్టకష్టాలు పడుతున్నావు. మించిపోయిందేంలేదు. పన్నెండు ఆవకొమ్మలు తీసుకునిరా. అవి పూతకాయలతో ఉండాలి. వాటిని పన్నెండు అట్లమీద పెట్టు. రవికెలగుడ్డ, దక్షిణ, తాంబూలము, నెయ్యి,బెల్లము తెచ్చి వాయనమిచ్చి నమస్కరించు .అంతే. నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. బాధలుండవు. చీకు, చింత తొలగిపోతాయి. దరిద్రముండదు. శ్రద్ధాశక్తులతో ఆచరించు, లోపం జరగనీయకు అని చెప్పి వారిద్దరూ అంతర్ధానమయ్యారు. ఆ ఇల్లాలు శివపార్వతులు చెప్పినవిధంగా చేసింది. తన అపచారానికి పశ్చాత్తాప పడింది. భక్తితో వ్రతమాచరించింది. సుఖపడింది. కథ యందు ఉద్యాపన చెప్పబడినది. కావున శ్రద్ధాభక్తులతో ఈ వ్రతం చేసి స్త్రీలు ఫలం పొందండి. స్త్రీలందరూ చేయవచ్చు. అత్యంత ఫలప్రదమైన నోము ఇది.
పాట.
అట్లమీద అవపూల నోముఇది
అందరందరాచరించు నోముఇది
పేదవారు చేసిన శ్రీమంతులు అగుదురు
ధనవంతులు చేసిన కుబేరులే అగుదురు
పూటా - కాయలుగల ఆవకొమ్మలు తెచ్చి
పదిలంగా పన్నెండు అట్లపై ఉంచి
బెల్లము, పేరైన నీటిని తెచ్చి
దక్షిణ తాంబూలములతోనవి ఇచ్చి
రవికెలగుడ్డలతో వాయనములనిచ్చి
ఉద్యాపన జెసి ఉపచారములచేసి
ఆదిదంపతులు ముందుగా మొక్కి
శివ - పార్వతులకు మీరు శిరసునేవంచి
శ్రద్ధతో భక్తితో నియమనిష్టలతోను
అత్యంత ప్రీతితో వ్రతమాచరించి
ఫలమును పొంది సుఖమును పొంది
మీరాచరించి అందరికి చెప్పి
సుఖశాంతులు పంచండి స్త్రీలందరకూ మీరు
భోగ,భాగ్యాలతో బ్రతకండి అందరు
మంగళం మంగళం మంగళం శివునికి
మంగళం మంగళం మహిమగల తల్లికి.
శుభంభూయాత్.
****************************************
Comments
Post a Comment
thanking you comment visit our website
https://kbsastrology.com/