సంపద శుక్రవారపు నోము

సంపద శుక్రవారపు నోము పూర్వకాలంనాటి మాట. కాంభోజ రాజ్యాన శివశర్మ అను బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయనకు ఏడుగురు కుమారులు. తండ్రి అందరికీ వివాహాలు చేసి ఉన్న ఆస్తిపాస్తులు సమంగా పంచి మరణించాడు. అనంతరం కుమారులు విడిపోయారు. కలసి ఉండేవారుకాదు.అందుకొందరు భ్రష్టులయ్యారు. మరికొందరు ఆచారహీనులయ్యారు. ఏది ఏమైతేనేం అందరికందరు దరిద్రం అనుభవించసాగారు.ఎవరెలా ఉన్నా కాలం ఆగదు. దానిపని అది చేసికొనిపోతుంది.క్రమం తప్పదు. నియమం పాటిస్తూ అది దాని విధి చేసికొంటూ పోతుంది. ఒకనాడు శ్రీలక్ష్మి భూలోక సంచారంచేస్తూ అష్టకష్టాలు పడే ఆ బ్రాహ్మణుని కుమారుల ఇండ్లకు వెళ్ళింది. వరుసగా చూసింది. అక్కడ వారి ఇండ్లలో........ పెద్దకోడలు పద్మ పాచిచేయక జుట్టు విరబోసుకుని కూతురుకు పేలు చూస్తోంది. రెండవకోడలు సావిత్రి పరచిన తీయక పిల్లలకు చద్దియన్నం పెడుతోంది. మూడవ కోడలు కామాక్షి పాతగుడ్డలు కుడుతూ కూచుంది. నాల్గవ కోడలు జయంతి గచ్చకాయలాడుతోంది. అయిదవ కోడలు అన్నపూర్ణ ఇరుగుపొరుగు వారితో గొడవలు పెట్టుకుంటోంది. అందరినీ చూసి విసిగిపోయి చివరకు ఏడవకోడలు ఇంటికి వెళ్ళింది. ఆమె పేరు విజయ కళ్యాణీ రాధిక. తెల్లవారుజామున లేచింది. ఇల్లు శుభ్రం చేసుకొంది. రంగవల్లులు తీర్చి దిద్దింది. స్నానం చేసింది. కుంకుమబొట్టు పెట్టుకున్నది. గౌరీదేవికి పూజ లక్ష్మి ఆమెను చూసి ముచ్చట పడినది. లోనికివెళ్ళి అమ్మా! నేను తీర్ధ యాత్రలు చేయుచూ ఈనాడు మీ ఇంటిముందు ఆగినాను. రేపు వెళ్ళిపోతాను. మీఇంట ఉండవచ్చునా.? అని అడిగింది. అంత ఆ చిన్నది - తల్లీ సాక్షాత్తూ లక్ష్మీదేవిలా ఉన్నావు. ఉండు తల్లీ. నా భర్త యాయవారమునకు వెళ్ళినాడు. తెచ్చినది వండి వడ్డిస్తాను. లేనిది పెట్టలేను. ఉన్నది దాచుకోను. ఆరగించి సంతోషంగా వెళ్ళవచ్చు అని అన్నది. లక్ష్మీ పరమానంద భరితురాలయింది. పవిత్రాక్షతలిచ్చి అమ్మా ! వీటిని తలపై వేసుకుని నీ పనులు చేసుకో అంతే. సరేనని ఆమె తలపై అక్షతలు వేసుకొని పనిలో నిమగ్నమైనది. భర్త ఆనాడు అనుకోకుండా ఎన్నో పదార్ధాలు ఇంటికి తెచ్చాడు. అంత ఆమె తొందరగా వంట వండి నివేదన పెట్టి తన ఇంటికి వచ్చిన లక్ష్మికి వడ్డించింది. దంపతులిద్దరూ ఆమె సరసన కూర్చుని భోజనం చేశారు. రాత్రి వారియింటనే నిద్రపోయింది.ఆ తల్లి. తెల్లవారగానే ఆమె వెళ్ళిపోయింది. దంపతులు లేచి చూసేసరికి ఇల్లంతా సిరి, సంపదలు, ధనరాశులు. ఆశ్చర్యపోయారు. వచ్చినది మహాలక్ష్మీ దేవియని భక్తిశ్రద్ధలతో సంపద శుక్రవారపు నోము నోచి సుఖ, శాంతులతో జీవించారు. ఉద్యాపన :- ప్రతి శుక్రవారం లక్ష్మిని పూజించాలి. ఒక్కపూట భోజనం చేయాలి. నేలపై పరుండాలి. 5గురు ముత్తయిదువులకు పసుపు , కుంకుమలతో అలంకారం చేయాలి. తాంబూలం ఈయాలి. అలా 3 సంవత్సరాలు చేయాలి. అనంతరం 5 గురు పేరంటాళ్లను పిలచి తలంటాలి. బొట్టుపెట్టి కాటుక దిద్దాలి.చీర, రవికల గుడ్డ, దక్షిణ తాంబూలం ఇచ్చి భోజనం పెట్టాలి. మహాలక్ష్మీరూపణులుగా ఆరాధించాలి. తప్పక ఫలితం సిద్ధిస్తుంది. సర్వేజనా సుఖినోభవంతు.

Comments

Popular posts from this blog

వినాయక వ్రతము

క్షీరాబ్ధి ద్వాదశి పూజ

నందికేశుడి నోము.